Titley: నేలరాలిన భారీ వృక్షాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు... సాయంత్రం వరకూ కొనసాగనున్న తిత్లీ ప్రభావం!
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
- తెలంగాణకూ వర్ష సూచన
తీరం దాటే వేళ తిత్లీ, పెనుగాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. భారీ వృక్షాలు నేలరాలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాగుల్లోకి భారీగా వరదనీరు రావడంతో, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా రహదారులపై ట్రాఫిక్ ను నిలిపివేసిన అధికారులు, పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. సాయంత్రం వరకూ తిత్లీ విధ్వంసం కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆ తరువాత మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే తిత్లీ, చత్తీస్ గడ్, తూర్పు తెలంగాణ వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
తిత్లీ ప్రభావం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలపైనా కనిపించింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో అలలు రోడ్డుపైకి ఎగసిపడుతుండగా, రహదారి ధ్వంసమైంది. రోడ్డు తెగిపోయి, సమీపంలోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన సంజీవరావు అనే మత్స్యకారుడు మరణించాడు.