Telangana: టీఆర్ఎస్ అధిష్ఠానం నాకు అన్యాయం చేసింది.. రెబెల్ గా పోటీచేస్తా!: కావేటి సమ్మయ్య

  • ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేశా
  • టీఆర్ఎస్ లో ఇప్పుడు ఉద్యమ వ్యతిరేకులే ఉన్నారు
  • హైకమాండ్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధిష్ఠానం తనకు అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆరోపించారు. తాను టీఆర్ఎస్ టికెట్ పై రెండుసార్లు గెలుపొందాననీ, ప్రత్యేక రాష్ట్రం కోసం ఓసారి రాజీనామా కూడా సమర్పించానని వెల్లడించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు గెలుచుకున్నా, ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నారన్న కారణంతో బయటివారిని చేర్చుకున్నారనీ.. దీనికి తాను కూడా అంగీకరించానని చెప్పారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమ్మయ్య మాట్లాడారు.

తాను పార్టీ హైకమాండ్ ను కలిసిన ప్రతిసారీ తనకు న్యాయం చేయాలని కోరాననీ, కాని సిర్పూర్ కాగజ్ నగర్ టికెట్ ను బయటి వ్యక్తి అయిన కోనేరు కోనప్పకు కేటాయించి పార్టీ అధిష్ఠానం తనకు ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడని, పోరాడని వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకోవాలనీ, సిర్పూర్ టికెట్ ను తనకు కేటాయించాలని కోరారు. లేదంటే రెబెల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు.

  • Loading...

More Telugu News