google: ప్రియురాలి ఖర్చుల కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి!
- పెనుభారంగా మారిన ప్రియురాలి ఖర్చులు
- ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ లోని డబ్బులు దొంగిలించిన వైనం
- కొంత మొత్తాన్ని రికవరీ చేసిన పోలీసులు
తన ప్రేయసి అవసరాలు తీర్చేందుకు దొంగగా మారిన ఓ ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, హర్యాణాలోని అంబాలా జిల్లాకు చెందిన గర్విత్ సాహ్ని అనే యువకుడు ఢిల్లీలో గూగూల్ లో పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 11న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఎంఎన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు ఐబీఎం, ఒక మీడియా సంస్థ కలసి ఒక కార్ఫరెన్స్ ను నిర్వహించాయి. ఈ సందర్భంగా దావయాణి జైన్ అనే మహిళ ఎవరో తన హ్యాండ్ బ్యాగ్ నుంచి రూ. 10 వేలను దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. నిందితుడు గర్విత్ ను గుర్తించిన పోలీసులు గత మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియురాలు ఖర్చులను భరించడం తనకు తలకు మించిన భారంగా మారిందని... అందుకే డబ్బును దొంగిలించానని పోలీసు విచారణలో గర్విత్ తెలిపాడు. గర్విత్ నుంచి పోలీసులు రూ. 3వేలు రికవరీ చేశారు.