Tirumala: చిన్న శేష వాహనంపై వెంకన్న, లలితా త్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ!
- తిరుమాడ వీధుల్లో ఊరేగిన దేవదేవుడు
- రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు
- నేటి సాయంత్రం హంసవాహనంపై మలయప్ప స్వామి
- భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ఉదయం చిన్న శేష వాహనంపై తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల రెండో రోజైన నేడు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు మాడ వీధులకు పోటెత్తడంతో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు వెలవెలబోయాయి. కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే మూల విరాట్టును దర్శించుకునేందుకు భక్తులు వేచివున్నారు. వీరికి 3 గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని టీటీడీ ప్రకటించింది. కాగా, నేటి సాయంత్రం హంస వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
కాగా, దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తోంది. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మూలవిరాట్టును అన్నపూర్ణాదేవిగా అలంకరించగా, అమ్మను దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శైవాలయాల్లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.