Srikakulam District: 'తిత్లీ'తో అస్తవ్యస్తం... 'హుద్ హుద్'ను మించిన నష్టం!
- శ్రీకాకుళం జిల్లాను వణికించిన 'తిత్లీ' పెను తుఫాను
- నేలకొరిగిన వేలాది చెట్లు
- ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టం సంభవించలేదన్న అచ్చెన్నాయుడు
ఒడిశాలోని పలు జిల్లాలతో పాటు ఏపీలోని ఉత్తర కొస్తాలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను వణికించిన 'తిత్లీ' పెను తుఫాను ధాటికి వాటిల్లిన నష్టం, నాలుగేళ్ల నాటి హుద్ హుద్ తుపానును మించిపోయింది. నాటి అనుభవాల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ఇక ఈ ఉదయం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన రవాణా మంత్రి అచ్చెన్నాయుడు, హుద్ హుద్ కన్నా, తిత్లీ తీవ్రత చాలా ఎక్కువని చెప్పారు.
ఆస్తి నష్టం భారీగా ఉందని, వేలాది చెట్లు నేలకు ఒరిగాయని చెప్పారు. ప్రకృతి విపత్తులను ఆపలేముగానీ, ప్రభుత్వం తరఫున సరైన చర్యలు తీసుకుని నష్టాన్ని కొంతమేరకు తగ్గించగలిగామని తెలిపారు. జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు మంచినీరు, ఆహారాన్ని అందిస్తున్నామని, వర్షం తగ్గకపోయినా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.