Pawan Kalyan: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాదెండ్ల మనోహర్.. 'జనసేన'లో చేరనున్న మాజీ స్పీకర్!
- పవన్ తో ఇటీవల భేటీ అయిన మనోహర్
- రాజకీయ భవిష్యత్ పై చర్చ
- సానుకూలంగా స్పందించిన జనసేన అధినేత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమైన మనోహర్.. పార్టీలో చేరిక, రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. ఈ సందర్భంగా తమ పార్టీలోకి రావాల్సిందిగా మనోహర్ ను పవన్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మనోహర్ రాజీనామా సమర్పించారు. ఈ రోజు సాయంత్రం పవన్ కల్యాణ్ తో కలిసి మనోహర్ తిరుమలకు వెళ్లనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడైన మనోహర్ 2004లో తొలిసారి తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2009లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే మాజీ సీఎం వైఎస్సార్ మరణంతో తొలుత రోశయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ బాధ్యతలు చేపట్టారు. దీంతో 2011లో నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీకి స్పీకర్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మనోహర్ ఓటమిని చవిచూశారు.