Narendra Modi: మోదీ రూ.30 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి!: కాంగ్రెస్ చీఫ్ రాహుల్
- మీడియాపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోంది
- ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే అవినీతి జరిగిందన్నారు
- మీ టూ ఉద్యమంపై మళ్లీ స్పందిస్తా
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో రహస్యంగా ఉంచాల్సిన అంశాల్లో విమానం ధర లేనేలేదని తేల్చిచెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పారని రాహుల్ గాంధీ వెల్లడించారు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందనీ, అయినా లొంగనివారిపై ఐటీ దాడులు చేయిస్తోందని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ ప్రధాని మోదీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
దేశానికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ అవినీతిపరుడిగా తయారయ్యారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాడతానన్న హామీతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. అనిల్ అంబానీకి మోదీ రూ.30,000 కోట్లు అప్పనంగా ఇచ్చేశారన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ వివరాలు ఇవ్వాలని నిన్న కోరగానే రాత్రికిరాత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ కు వెళ్లారనీ, దీని వెనుక అసలు రహస్యం ఏంటని రాహుల్ ప్రశ్నించారు.
మోదీ అవినీతికి పాల్పడ్డారు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే, డస్సాల్ట్ కంపెనీలో నంబర్ 2 అధికారి ఇద్దరూ.. మోదీ అవినీతి పరుడనే చెప్పారన్నారు. డస్సాల్ట్ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి తన అవినీతిని మోదీ దాస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా కాంట్రాక్టును దక్కించుకోలేరని డస్సాల్ట్ కంపెనీకి కేంద్రం స్పష్టం చేసినట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్ లభ్యమయిందని రాహుల్ ఆరోపించారు.
ఇదొక్కటే కాదనీ కేంద్రం గతంలో చేసుకున్న పలు ఒప్పందాలకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయని రాహుల్ జోస్యం చెప్పారు. రాఫెల్ ఒప్పందంపై చర్చకు రావాలనీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరితే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పారిపోయారని విమర్శించారు. త్వరలోనే మీ టూ ఉద్యమంపై స్పందిస్తానని రాహుల్ జవాబిచ్చారు.