sports: మలింగా మెడకు ‘మీ టూ’ ఉచ్చు.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువతి ఆరోపణ!
- ముంబైలో ఐపీఎల్ సందర్భంగా జరిగిన ఘటన
- గాయని చిన్మయికి ట్వీట్ చేసిన యువతి
- హోటల్ సిబ్బంది రావడంతో తప్పించుకున్నానని వెల్లడి
భారత్ లో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమ కలకలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సుభాష్, గాయకుడు కైలాశ్ ఖేర్, శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ, తమిళ గీత రచయిత వైరముత్తు సహా పలువురి పేర్లు ఇప్పటివరకూ బయటకు వచ్చాయి. తాజాగా శ్రీలంక పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగా ఈ వివాదంలో చిక్కుకున్నాడు. మలింగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఈ రోజు ఆరోపించింది. సదరు ఆరోపణలను గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరిన బాధితురాలు మలింగా తనతో ఎలా ప్రవర్తించాడో పోస్టులో వర్ణించింది. ‘‘కొన్నేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ముంబైలోని ఓ హోటల్‌లో నా స్నేహితురాలితో కలిసి దిగాను. అదే హోటల్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగా కూడా దిగాడు. ఓరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే ఒకరు ఆమె మలింగా గదిలో ఉందని చెప్పారు. నేను వెంటనే అక్కడకు వెళ్లాను. అయితే అక్కడ ఎవ్వరూ లేరు. తలుపు తీసిన మలింగా నన్ను బెడ్ పైకి తోసేశాడు. అనంతరం నాపైకి వచ్చి ముఖాన్ని తడిమాడు. అతడిని ప్రతిఘటించే శక్తి లేకపోవడంతో గట్టిగా కళ్లు మూసుకుని ఉండిపోయాను.
అంతలో హోటల్ సిబ్బంది వచ్చి డోర్ బెల్ కొట్టారు. వెంటనే అతను డోర్ తీసేందుకు వెళ్లడంతో నేను వాష్ రూమ్ లోకి వెళ్లిపోయాను. ముఖమంతా కడుక్కుని హోటల్ సిబ్బంది కంటే ముందుగానే ఆ గది నుంచి బయటపడ్డాను. ఆ ఘటన నాకు చాలా అవమానకరంగా అనిపించింది. ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా ‘నీకు తెలిసే వెళ్లావు’ ‘అతను ఫేమస్ వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడుతున్నావ్’ ‘నువ్వు కావాలనుకునే అతని గదిలోకి వెళ్లావ్ కదా’ అంటూ విమర్శిస్తారని నాకు తెలుసు. అయినా సరే నేను నిజాన్ని బయటపెడుతున్నా’’ అంటూ సదరు యువతి ట్వీట్ చేసింది. దీన్ని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది.