Revanth Reddy: నలుగురు దోపిడీదారులు, నాలుగు కోట్ల ప్రజల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది: రేవంత్ రెడ్డి
- జనాలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు
- తొమ్మిది స్థానాల్లో గెలిపించిన నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేయలేదు
- అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో చెప్పాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలోని నలుగురు దొంగలు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగు కోట్ల ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగబోతోందని చెప్పారు. బంగారు తెలంగాణ చేస్తానంటూ జనాలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలలో టీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించారని... అయినా కేసీఆర్ కానీ, నిజామాబాద్ ఎంపీ కవిత కానీ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు తగ్గలేదని చెప్పారు. అర్ధాంతరంగా అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు ప్రగతి భవన్ లో ప్రవేశం లేకుండా నిషేధించారని విమర్శించారు.