KTR: ‘కేంద్రం అనేది మిథ్య’ అని ఎన్టీఆర్ ఏనాడో చెప్పారు: అమిత్ షాపై విరుచుకుపడ్డ కేటీఆర్
- తెలంగాణకు కేంద్రం డబ్బులిస్తున్నట్టు చెబుతున్నారు
- రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు
- గత నాలుగేళ్లలో దేశానికి మోదీ ఏం చేశారు?
నిన్న కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. వేములవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో పర్యటించినప్పుడు చెప్పిన మాటలే ఆయన మళ్లీ చెప్పిపోయాడని విమర్శించారు. నిన్న కరీంనగర్ లో బీజేపీ నిర్వహించింది ‘సమరభేరి’ కాదని ‘అసమర్ధ భేరీ’ అని అభివర్ణించారు.
గత నాలుగేళ్లలో దేశానికి మోదీ ఏం చేశారని అడిగితే చెప్పలేని పరిస్థితిలో వారు ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్వివిభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నిలుపుకోలేని ప్రభుత్వమని కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం డబ్బులిస్తున్నట్టుగా అమిత్ షా చెబుతున్నారని, రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదని, రాష్ట్రాలు పన్నులు కట్టందే, కేంద్రానికి ఎటువంటి ప్రతిపత్తీ లేదని, ‘కేంద్రం అనేది మిథ్య’ అని తాను చెబుతున్న మాట కాదని, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.