Rampal: రెండు హత్య కేసుల్లో దోషిగా తేలిన బాబా రాంపాల్
- నలుగురు మహిళలు, ఓ చిన్నారి మృతదేహం లభ్యం
- 27 మంది అనుచరులు కూడా దోషులుగా నిర్థారణ
- హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న రాంపాల్
హిస్సార్‌లోని బర్వాలాలో రాంపాల్‌కు చెందిన సత్లోక్ ఆశ్రమంలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి మృతదేహాలు లభ్యమైన కేసులో నేడు హరియాణా కోర్టు తీర్పు వెలువరించింది. తనను తాను బాబాగా ప్రకటించుకున్న రాంపాల్‌ను రెండు హత్య కేసుల్లో దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో రాంపాల్‌తో పాటు 27 మంది ఆయన అనుచరులను కోర్టు దోషులుగా నిర్థారించింది. వీరికి అక్టోబరు 16, 17 తేదీల్లో శిక్షలు ఖరారు కానున్నాయి.
2014 నవంబరు 19న రాంపాల్ ఆశ్రమంలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సమయంలో జరిగిన ఆందోళనల్లో ఆరుగురు మరణించగా, వందల మంది గాయాలపాలయ్యారు. 2015 నవంబర్‌లో రాంపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు తీర్పు నేపథ్యంలో హరియాణాలోని హిస్సార్ జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాంపాల్ హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు.