modi: మోదీ గారి ఇంటెనుక పొలం అమ్మి మాకేమీ డబ్బులివ్వడం లేదు!: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

  • కేంద్రానికి మేము ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాం.
  • పన్నులుగా కట్టిన పైసల్లో నుంచే మాకు ఇస్తున్నారు
  • అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా

తెలంగాణకు కేంద్రం డబ్బులిస్తోందని అదే పనిగా చెబుతున్న అమిత్ షాకు మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. వేములవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ‘కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాకు (తెలంగాణ) ఇస్తున్నదంటే.. నరేంద్రమోదీ గారి ఇంటెనుక పొలం అమ్మి మాకేమీ ఇవ్వడం లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు పన్నులుగా కట్టిన పైసల్లో నుంచి.. రాష్ట్రానికి ఒక దామాషా ప్రకారం ఏవైతే రావాలో అవి మాత్రమే వస్తున్నాయి తప్ప, వాటికి అదనంగా ఒక్క పైసా అయినా కేంద్రం ఇచ్చిందా?

తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఈ నాలుగేళ్లలో సగటున 17.17 అభివృద్ధి రేటుతో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుకు తీసుకుపోతున్నాం.. కేంద్రానికి మేము ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాం. జాతీయ, ఇతర రాష్ట్రాల సగటు వృద్ధి రేటు కంటే తెలంగాణ సగటు వృద్ధి రేటు ఎక్కువ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాం.

ఈ విషయాలను ఏ ఆర్థికవేత్తను అడిగినా అమిత్ షా గారికి సోదాహరణంగా వివరించి చెబుతారు’ అని కేటీఆర్ సూచించారు. 17.17 అభివృద్ధి రేటుతో దూసుకుపోతున్న రాష్ట్రానికి అండగా నిలవాల్సిందిపోయి అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని అన్నారు. బాగా పని చేసే ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఉన్నారని నాడు పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన విషయాన్ని అమిత్ షాకు గుర్తులేదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News