amitshar: చుట్టపు చూపుగా వచ్చిన అమిత్ షా నోటికొచ్చినట్టు మాట్లాడిపోయారు: కేటీఆర్
- మీరు అమలు చేయని హామీల చిట్టా సంగతేంటి?
- ప్రస్తావిస్తే మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలియదు?
- మా ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
తెలంగాణ అగ్రరాష్ట్రం అవుతుందని ప్రధాన మంత్రి మోదీ చెబుతారని, హైదరాబాద్ లాంటి రాష్ట్రాలు ఇంకా పది ఉంటే దేశం బాగుపడుతుందని ఇక్కడికి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రీ తమను పొగుడుతుంటే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం తన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న కరీంనగర్ లో జరిగిన బీజేపీ ‘సమరభేరి’లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
వేములవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చుట్టపు చూపుగా వచ్చిన అమిత్ షా నోటికొచ్చినట్టు మాట్లాడిపోయారు. మీరు అమలు చేయని హామీల చిట్టాను నేను చదివితే తల ఎక్కడ పెట్టుకోవాలో మీకు తెలియదు. అలాంటి పరిస్థితి మీది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హాదా కల్పించమని నాడు ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరితే ఇంతవరకూ దానిపైన స్పందన లేదని, ఒక్క మాట కూడా మోదీ నోటి నుంచి రాలేదని విమర్శించారు.
తెలంగాణలో ‘మిషన్ కాకతీయ’, ‘మిషన్ భగీరథ’ రెండు అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నారని, ఈ రెండు ప్రాజెక్ట్ లలో ఒక దానికి ఐదు వేల కోట్లు, మరో దానికి పదిహేను వేల కోట్లు ఇవ్వాలని భారతదేశపు రూపురేఖలు మార్చేందుకని పెట్టిన ‘నీతి ఆయోగ్’ కేంద్రానికి సిఫారసు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. స్వయంగా ‘నీతి ఆయోగ్’ సిఫారసు చేసినప్పటికీ ఈ ప్రాజెక్టులకు మూడేళ్లలో మూడు పైసలైనా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందా? అని అమిత్ షాను ప్రశ్నించారు.