Hyderabad: తిత్లీ తుపాను ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో గాలి దుమారం.. నగరవాసుల అవస్థ!

  • తిత్లీ తుపాను ప్రభావంతో నగరంలో పలుచోట్ల గాలి దుమారం
  • గాల్లోకి లేచిన దుమ్ము, ధూళి
  • ఇబ్బందులు పడిన వాహనదారులు, పాదచారులు

హైదరాబాద్‌ నగరంలో గురువారం రేగిన గాలి దుమారం నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుపాను ప్రభావం హైదరాబాద్‌లోనూ కనిపించింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం రేగింది. గాలులు బలంగా వీయడంతో వాహనాదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై దుమ్ము, ధూళి పెద్ద ఎత్తున గాల్లోకి లేవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు.  నగర శివారు ప్రాంతాలైన సుచిత్ర, కొంపల్లి, సురారం, ఐడీఏ బొల్లారం, లంగర్‌హౌజ్, షేక్‌పేట ప్రాంతాల్లో బలంగా గాలులు వీచాయి. ఒక్కసారిగా గాలి దుమారం రేగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దుమ్ము, ధూళి కళ్లలోకి వెళ్లడంతో కొందరు ద్విచక్ర వాహనదారులు పట్టుతప్పి కిందపడ్డారు.

మరోవైపు, గాలి దుమారం కారణంగా గురువారం పెద్ద ఎత్తున దుమ్ము రేణువులు గాలిలో కలిశాయి. నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువగా గాలిలోకి చేరాయి. గాలిలో పీఎం 2.5 పరిమాణం 50 మైక్రోగ్రాముల వరకు ఉండొచ్చు. అయితే, గురువారం మాత్రం ఇది 60.90 మైక్రోగ్రామ్ క్యూబిక్ మీటర్లుగా నమోదైనట్టు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. గాలిలో పీఎం 10 నిర్ణీత ప్రమాణం 100 మైక్రోగ్రామ్ క్యూబిక్ మీటర్లు కాగా, అది ఏకంగా 148 మైక్రో క్యూబిక్ మీటర్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News