CM Ramesh: టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లలో ఐటీ సోదాలు
- దాడుల్లో పాల్గొంటున్న 60 మంది
- కడప, హైదరాబాద్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు
- ఇటీవలే ఐటీ శాఖను వివరాలు అడిగిన సీఎం రమేష్
- మూడు రోజులు తిరగకుండానే దాడులు
తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, కడపలో ఉన్న ఆయన నివాసాలకు, కార్యాలయాలకు చేరుకున్న సుమారు 60 మంది ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసంలో సోదాల నిమిత్తం 15 మంది అధికారులు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన సోదరుడి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి.
కాగా, ప్రస్తుతం సీఎం రమేష్ న్యూఢిల్లీలో ఉన్నారు. కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న ఆయన, దేశంలో ఐటీ దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? ఎందుకు చేస్తున్నారు? ఏపీలో జరుగుతున్న దాడుల వివరాలు తెలియజేయాలంటూ, ఆదాయపు పన్ను శాఖకు ఇటీవల ఆయన నోటీసులు పంపించారు. నోటీసులు పంపిన మూడు రోజుల వ్యవధిలోనే రమేష్ ఆస్తులపై దాడులు జరగడం గమనార్హం. కేంద్రం చేస్తున్న అన్యాయాలను, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రశ్నిస్తున్నందునే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసి భయపెడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.