IT Raids: రాజకీయ రంగు పులిమి తప్పించుకుందామని చూస్తున్న సీఎం రమేష్: జీవీఎల్
- తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష
- తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై అభాండాలు
- సీఎం రమేష్ అవినీతిపై ఐటీ అధికారుల వద్ద ఆధారాలు
- బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు
తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడక తప్పదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. సీఎం రమేష్ ఇంటిపై, కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ దాడులను ప్రస్తావించిన ఆయన, సీఎం రమేష్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. జరుగుతున్న దాడులకు, బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించిన ఆయన, తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. ఐటీ దాడులకు రాజకీయ రంగు పులిమి తప్పించుకుందామని సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారని, తప్పు చేస్తే చట్టం ముందు ఎంతటి వారైనా సమానమేనని అన్నారు.
ఇతర పార్టీల ప్రముఖులపైనా ఇటువంటి సోదాలు జరుగుతున్నాయని, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఎవరి లావాదేవీలనైనా పరిశీలించే అధికారముందని చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న వేళ కూడా ఐటీ సోదాలు జరిగాయని జీవీఎల్ అన్నారు. సీఎం రమేష్ అవినీతిపైనా, పన్నుల ఎగవేతలపైనా ఐటీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయనే తాను భావిస్తున్నానని చెప్పారు.