Andhra Pradesh: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు సుప్రీంకోర్టు షాక్.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ!
- నిబంధనలకు విరుద్ధంగా నగదు సేకరించిన కేసు
- 2006-07లో ఏకసభ్య కమిషన్ నియామకం
- ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున నిధులను సేకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థకు సుప్రీంకోర్టులో ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కింద విచారణ జరపరాదని మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సమయంలో కేసు విచారణలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్ల పేరిట ప్రజల నుంచి మార్గదర్శి ఫైనాన్షియర్స్ కంపెనీ రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లను సేకరించినట్లు కేసు నమోదయింది. దీంతో 2006-07 మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఏక సభ్య కమిషన్ ను నియమించింది. అనంతరం కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసును దాఖలుచేసింది. అయితే ఈ కేసు క్రిమినల్ ప్రొసీడింగ్స్ పై మార్గదర్శి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది.
తాజాగా ఈ స్టే గడువు ముగిసిపోయిన నేపథ్యంలో మరోసారి స్టే ను పొడిగించాలని సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శి పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో కావాలనుకుంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. కేసు విచారణలో ఉన్న ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పునరుద్ఘాటించింది.