Bollywood: రంగంలోకి దిగిన ఆమిర్ ఖాన్.. లైంగిక వేధింపులపై కమిటీ!

  • కమిటీలో పలువురు సెలబ్రిటీలు
  • లైంగిక వేధింపులపై అవగాహనా కార్యక్రమాలు
  • ఇండస్ట్రీని అందరికీ సురక్షితంగా మార్చడమే లక్ష్యం

 ‘మీ టూ’ ఉద్యమం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. లైంగిక వేధింపులకు గురయ్యామంటూ పలువురు మహిళలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ స్పందించారు. ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్‌ కపూర్‌తో కలిసి మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్టవేయడానికి నడుం బిగించారు.

ఇండస్ట్రీలో మహిళల భద్రతకు మార్గదర్శకాలు సూచించడం కోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. మహిళలపై లైంగిక వేధింపుల సమస్యను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఈ కమిటీకి స్నేహ రజని నేతృత్వం వహించనున్నారు. అపూర్వ మెహతా, ఏక్తా కపూర్, ఫజిలా అల్లనా, ప్యోటి దేశ్‌పాండే, కిరణ్ రావు, కుల్మీత్ మక్కర్, మధు భోజ్వానీ, ప్రతీ షహాని, రోహన్ సిప్పీ, సిద్ధార్థ్ రాయ్ కపూర్, విజయ్ సింగ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
 
ఈ కమిటీ మొదటి సమావేశం బుధవారం జరిగింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపులను అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ కాపీలను సభ్యులందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. లైంగిక వేధింపుల సమస్యను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనుభవం కలిగిన సంస్థలతో కలిసి ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలను ఈ కమిటీ నిర్వహించనుంది. ఆఫీసులు, షూటింగ్ సెట్స్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల సమస్యను అధిగమించడానికి అవసరమైన విధానాలపై ఇండస్ట్రీలోని సభ్యులకు అవగాహన కల్పించనున్నారు.

 రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఇండస్ట్రీలోని సభ్యులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇండస్ట్రీలోని అన్ని వర్గాల వారికి సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా నియమించిన ఈ కమిటీ రానున్న రోజుల్లో మరింత కృషి చేయనుంది. తరచుగా మరిన్ని సమావేశాలు నిర్వహించనుందని కమిటీ సభ్యులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News