nitishkumar: బిహార్ సీఎంపై చెప్పు విసిరిన యువకుడు!
- బిహార్ సీఎంకు ఎదురైన అవమానకర ఘటన
- రిజర్వేషన్లు తొలగించాలంటూ నిందితుడి డిమాండ్
- పార్టీ కార్యకర్తల దాడిని అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు రిజర్వేషన్ల వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఆందోళనలు రాజకీయ నాయకులకు ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి. ఇదేకోవకు చెందిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు అవమానకరమైన ఘటన ఎదురైంది. పాట్నాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న నితీష్‌పై చంద్రమోహన్ అనే యువకుడు చెప్పు విసిరాడు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్ల కారణంగా తాను నష్టపోతున్నానని పేర్కొంటూ ఆగ్రహానికి గురయిన చంద్రమోహన్ చెప్పు విసిరాడు. తాను అగ్రకులానికి చెందిన వ్యక్తినని, అందుకే ఉద్యోగం పొందలేకపోతున్నానని ఆవేశంగా మాట్లాడాడు.
నితీష్‌పై చెప్పు విసిరిన చంద్రమోహన్‌పై దాడి చేసేందుకు జేడీయూ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే నితీష్ కుమార్‌పై చెప్పు విసరడం ఇది మొదటి ఘటన కాదు. గతంలో పీకే రాయ్ అనే వ్యక్తి కూడా నితీష్‌పై బూటు విసరడం, అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బిహార్‌లో ఇటీవల పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. రిజర్వేషన్ల వ్యవస్థను తొలగించాలని డిమాండ్ చేస్తూ కొన్ని సామాజిక వర్గాల యువత ఎన్డీఏకు వ్యతిరేకంగా తీవ్రస్థాయి ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనలు తగ్గాయని భావిస్తున్న తరుణంలో నితీష్‌పై ఈ దాడి జరగడం గమనార్హం.