ntr: 'అరవింద సమేత'లో 'పెనివిటి' పాటపై పబ్లిక్ టాక్
- ఆకట్టుకునే 'పెనివిటి' పాట
- చెప్పుకోదగిన సాహిత్యం
- సహజంగా అనిపించని సందర్భం
అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ప్రతిపాట మనసుకు హత్తుకుపోయేలానే ఉంటుంది. వీటిలో రెండు పాటలు డాన్స్ లో ఎన్టీఆర్ సత్తా చాటిచెప్పేలా వున్నాయి. కష్టతరమైన స్టెప్స్ తో కూడిన డాన్స్ ను కూడా ఎన్టీఆర్ అదరగొట్టేశాడు అంటూ ఈ సినిమా చూసినవాళ్లు కితాబునిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంగీతం పరంగా .. సాహిత్యం పరంగా 'పెనివిటి' పాట చెప్పుకోదగినదిగా నిలుస్తుంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కాలభైరవ చాలా బాగా పాడాడు. భర్త రాకకోసం నిరీక్షిస్తూ .. జ్ఞాపకాలను కూడగట్టుకుని భార్యపాడే ఈ మాట మనసును భారం చేస్తుంది. ఏ మాత్రం వంకబెట్టడానికి వీలులేని ఈ పాట .. సినిమాలో సరైన సందర్భంలో పడలేదనే టాక్ పబ్లిక్ లో వినిపిస్తోంది. సహజంగా అనిపించే సందర్భం లేకపోవడం వలన, ఈ పాటను కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తోందని అంటున్నారు. ఈ పాటపై మరింత వర్కౌట్ చేసి వుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.