tata motors: టాటా మోటార్స్ లో ‘మీ టూ’ మృగం.. ఆఫీసులో పోర్న్ సైట్లు, మహిళా ఉద్యోగులకు బలవంతంగా మసాజ్!
- కార్పొరేట్ కమ్యూనికేషన్ చీఫ్ సురేశ్ నిర్వాకం
- బయటపెట్టిన బాధితురాలి ఫ్రెండ్
- సురేశ్ ను సెలవుపై పంపేసిన కంపెనీ
సినీరంగంలో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు ఎదురైన లైంగిక వేధింపులను బాధితులు ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. తాజాగా ప్రఖ్యాత భారతీయ కంపెనీ టాటా మోటార్స్ లో లైంగిక వేధింపుల పర్వం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టాటా మోటార్స్ కార్పొరేట్ కమ్యూనికేషన్ చీఫ్ సురేశ్ రంగరాజన్ అందరిముందే మహిళలను వేధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఓ బాధితురాలి ఫ్రెండ్ ఇచ్చిన సమాచారాన్ని జర్నలిస్ట్ సంధ్యా మీనన్ ట్విట్టర్ లో బయటపెట్టారు.
‘సురేశ్ రంగరాజన్ మనిషి రూపంలో ఉన్న ఓ మృగం. అతను తన టీమ్ లో పనిచేసే యువతులను వేధించుకుని తినేవాడు. రంగరాజన్ టీమ్ లో పనిచేస్తున్న నా స్నేహితురాలు ఒకరికి ఈ దారుణ అనుభవం ఎదురైంది. అతను రోజూ ఆమెకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాలు పంపేవాడు. తన ఇంటికి రావాలని వేధించేవాడు. డ్రింక్స్ కు రావాలని మరో 20 మంది అమ్మాయిలను ఇదేరకంగా ఇబ్బంది పెట్టాడు. చివరికి నా ఫ్రెండ్ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనీ, ఇంట్లో బయటకు పంపేందుకు ఒప్పుకోరని చెప్పింది. ‘అయితే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా వచ్చేయ్’ అంటూ సలహా ఇచ్చాడు.
ఇంకోసారి ఆయన ఇంట్లో డిన్నర్ సందర్భంగా అతి జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. భోజనం చేస్తూ ఒక్కసారిగా మరో యువతి వెనక్కు వెళ్లి భుజాలను మసాజ్ పేరుతో రుద్దడం ప్రారంభించాడు. దీంతో అక్కడి అమ్మాయిలు సైలెంట్ అయిపోయారు. చివరికి సదరు యువతి ‘నాకు సాయం చేయండి’ అని అరిచేంత వరకూ వదిలిపెట్టలేదు. ఆ తర్వాత పక్కనే కూర్చుని వెకిలిగా నవ్వుతూ ‘నిజమే చేతులతో కాకుండా నీకు బొటనవేళ్లతో మసాజ్ చేసి ఉండాల్సింది’ ‘ఇక్కడ కుర్చీకి బదులుగా మంచం ఉంటే చాలా బాగుండేది కదా’ అంటూ వేధించుకుతిన్నాడు. ఈ ఘటనతో బాధితురాలు పూర్తి షాక్ లోకి జారిపోయింది’’ అని తెలిపారు.
ఓసారి ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా తన ల్యాప్ టాప్ ను కనెక్ట్ చేసిన రంగరాజన్.. అశ్లీల సైట్ల వివరాలు కనిపించేలా హోమ్ స్క్రీన్ పైనే ఉంచాడని విమర్శించారు. అతని చర్యలతో టాటా మోటార్స్ లో మహిళా ఉద్యోగులు వణికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై టాటా మోటార్స్ యాజమాన్యం స్పందించింది. రంగరాజన్ ను అడ్మినిస్ట్రేటివ్ సెలవుపై పంపినట్లు వెల్లడించింది. ప్రతీ ఒక్కరికీ గౌరవనీయమైన సురక్షితమైన పని పరిస్థితులను కల్పించేందుకు తామెప్పుడూ కృషి చేస్తామని ప్రకటించింది.