paruchuri: తమిళంలో 'ఠాగూర్' క్లైమాక్స్ వేరు .. తెలుగులో మార్చేశాం: పరుచూరి గోపాలకృష్ణ
- తమిళంలో 'రమణ'లో అలా చూపించారు
- అలా చేస్తే అభిమానులకి నచ్చదని మార్చాము
- మార్పులు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాయి
చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'ఠాగూర్' ముందు వరుసలో కనిపిస్తుంది. చిరంజీవి అభిమానులు ఇప్పటికీ ఈ సినిమాను గురించి గర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఈ సినిమాకి రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పనిచేశారు. తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాను గురించి మాట్లాడారు.
"తమిళంలో 'రమణ' సినిమాలో హీరోకి ఉరిశిక్ష వేసినట్టుగా చూపించారు. తెలుగులో 'ఠాగూర్' పాత్రను ఉరితీస్తే సినిమా పరాజయంపాలు అవుతుందని భావించి, క్లైమాక్స్ ను మార్చడం జరిగింది. 'ఠాగూర్' పాత్రకి 5 సంవత్సరాల సాధారణ జైలుశిక్ష పడటం .. ఆ శిక్షను పూర్తిచేసుకుని బయటికి వచ్చి ఆయన శ్రియతో కలిసి వెళుతున్నట్టుగా ఒక హ్యాపీ మూడ్ లో ముగింపు ఇచ్చాము. ఈ మార్పులన్నీ కూడా ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి" అని చెప్పుకొచ్చారు.