Pawan Kalyan: జనసేన పార్టీ అందుకే పుట్టింది!: పవన్ కల్యాణ్
- అమరావతిలో పార్టీ కార్యాలయం ప్రారంభం
- నాదెండ్ల మనోహర్ తో కలిసి మీడియా సమావేశం
- రాష్ట్ర విభజనపై నిప్పులు చెరిగిన పవన్
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల్లో జవాబుదారీతనం లేకుండా పోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలాంటి అవగాహన లేకుండా, ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించకుండా విభజించారని విమర్శించారు. విభజన చట్టానికి ఆమోదం లభించడంతో రాత్రికిరాత్రి తెలంగాణలో కొన్ని బీసీ కులాలు ఓసీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నించేవారే కరువయ్యారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి నిర్ణయాల కారణంగా యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతోందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీసీలు ఓసీలుగా మారిపోయినా, వందలాది మంది ఉపాధి కోల్పోయినా కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించేవారే లేకపోయారని పవన్ తెలిపారు.
అధికారం కోసం ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేయకుండా ఉండేందుకు రాజకీయాల్లో జవాబుదారీతనం కోసమే తాను జనసేనను స్థాపించానని వెల్లడించారు. సీఎం కార్యాలయం, మంత్రుల ఇళ్లపై ఢిల్లీలో జరిగినట్లు తనిఖీలు జరిపితే తాము ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఎక్కడో గుంటూరు, కడప జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఫ్యాక్టరీలపై జరిగే వాటిపై తాము స్పందించబోమని తేల్చిచెప్పారు. నాదెండ్ల మనోహర్, తనది ఒకేరకమైన ఆలోచనా విధానమని పవన్ అన్నారు.