ram madhav: మహాకూటమిలో తెలంగాణ ద్రోహుల పార్టీ కూడా ఉంది: రాంమాధవ్
- తెలంగాణలో టీఆర్ఎస్ కు పోటీ బీజేపీ మాత్రమే
- టీఆర్ఎస్ దగ్గర అన్నీ ఉన్నాయి.. మన దగ్గర మోదీ ఉన్నారు
- మునిగిపోయే కూటములతో బీజేపీ జైత్రయాత్రను ఆపలేరు
టీఆర్ఎస్ దగ్గర అన్నీ ఉన్నాయని... కానీ, మన దగ్గర ప్రధాని మోదీ ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన పార్టీ నియోజక వర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీకి ఎదురొచ్చే నేత మరెవరూ లేరని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. తెలంగాణను తెచ్చింది తానేనని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకుంటుంటారని... కానీ, తొలి నుంచి తెలంగాణ కోసం పోరాడింది బీజేపీ మాత్రమేనని చెప్పారు. టీఆర్ఎస్ కు అధికారం కట్టబెడితే... ఐదేళ్లు పాలించలేకపోయిందని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్లలో రూ. 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని విమర్శించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు పోటీ బీజేపీ మాత్రమేనని రాంమాధవ్ చెప్పారు. అసెంబ్లీలో తమ బలాన్ని 5 నుంచి 65కు పెరిగేలా శ్రమించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మహకూటమిలో తెలంగాణ ద్రోహుల పార్టీ కూడా ఉందంటూ టీడీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మునిగిపోయే కూటములతో బీజేపీ జైత్రయాత్రను ఆపలేరని అన్నారు.