Sania Mirza: గర్భవతులు కూడా మనుషులే.. ఉచితసలహాలు మానుకోండి: సానియా ఫైర్
- ఉచిత సలహాలిచ్చే వారిలో మగవారి సంఖ్యే ఎక్కువ
- తొమ్మిది నెలలపాటు ఇంట్లోనే కూర్చోవాలా?
- సాధారణ జీవితం గడిపే అనుమతి వారికీ ఉంది
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం గర్భవతి అన్న విషయం తెలిసిందే. ఈ అక్టోబరులో బిడ్డకు జన్మనివ్వనుంది. ఇదిలా ఉండగా, సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు తనకు ఉచిత సలహాలు ఇస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది.
గర్భం ధరించిన మహిళలు తొమ్మిది నెలలపాటు బయటకు కనిపించకుండా ఇంట్లోనే ఉండాలని తనకు ఉచిత సలహాలు ఇచ్చే వారు అనుకుంటున్నారని, అలాంటి సలహాలు ఇచ్చే వారిలో ఎక్కువ మంది మగవారే ఉన్నారని పేర్కొంది. ఈ స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడి ఇంట్లోనే కూర్చోవాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించింది.
గర్భవతులు కూడా మనుషులే, సాధారణ జీవితం గడిపే అనుమతి వారికీ ఉందని, కాలు కదపకుండా ఇంట్లోనే కూర్చోవాలనుకునే ఆలోచనలు మానుకోవాలంటూ తన ట్వీట్లో క్లాస్ పీకింది. ‘మీరు ఎక్కడి నుంచి వచ్చారు.. అమ్మ పొట్టలో నుంచే కదా!’ అంటూ భావోద్వేగ పూరిత ట్వీట్లను సానియా చేసింది.