Sabarimala: శబరిమలకు వెళుతున్నానన్న తృప్తి దేశాయ్... పందళ రాజ కుటుంబీకుడి హెచ్చరిక!
- ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తి
- గతంలో శనిసింగనాపూర్ కు వెళ్లిన తృప్తి
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే నష్టమే
- పందళ రాజ కుటుంబీకుడి హెచ్చరిక
భారతావనిలో మహిళలకు అనుమతిలేని పలు ఆలయాల్లో మహిళలకు ప్రవేశాన్ని కోరుతూ సుప్రీంకోర్టులో కేసులు వేసి పోరాడుతున్న తృప్తి దేశాయ్, తాను అయ్యప్పను దర్శించుకునేందుకు త్వరలోనే వెళ్లనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. గతంలో మహరాష్ట్రలోని శనిసింగనాపూర్ లో మహిళల ప్రవేశం కోరి, విజయం సాధించిన ఆమె, భక్తుల నిరసనల మధ్యే, శనీశ్వరుడిని తాకి, దర్శించుకున్న సంగతి తెలిసిందే
భక్తులు ఆందోళనలు చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నారని శనివారం నాడు ఆరోపించిన ఆమె, తాను శబరిమలకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై కేరళవాసులు ఇప్పుడు మండిపడుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పందళ రాజ కుటుంబీకుడు శశికుమార్ వర్మ హెచ్చరించారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే, దారుణమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ తరహా ప్రకటనలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు తగదని అన్నారు. ఆలయ సంస్కృతిని కాపాడేందుకు లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారని అన్నారు.