India: పాపం రిషబ్ పంత్... మళ్లీ కొద్దిలో సెంచరీ మిస్!
- 92 పరుగుల వద్ద అవుటైన రిషబ్
- వికెట్ ను దొరకబుచ్చుకున్న గాబ్రియేల్
- డ్రింక్స్ లోపు మరో మూడు వికెట్లు చేజార్చుకున్న భారత్
భారత యువ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ మరోసారి తృటిలో సెంచరీ చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు. సచిన్ టెండూల్కర్ మాదిరిగా 'నైంటీస్ ఫోబియా' పట్టుకుందని అభిమానులు వ్యాఖ్యానిస్తుండే రిషబ్, నేడు 92 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు, మూడో రోజున, 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గాబ్రియేల్ బౌలింగ్ లో రిషబ్ అవుట్ అయ్యాడు. మొత్తం 134 బంతులాడిన రిషబ్, 11 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో ఈ స్కోర్ చేశాడు.
కాగా, ఓవర్ నైట్ స్కోరు 308/4 వద్ద నేటి ఆటను ప్రారంభించిన భారత్, డ్రింక్స్ సమయానికి మరో మూడు వికెట్లను కోల్పోయింది. 322 పరుగుల వద్ద అజింక్యా రహానే (80) అవుట్ కాగా, ఆపై క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. సెంచరీ సాధిస్తాడని భావించిన రిషబ్ అవుటైన అనంతరం అశ్విన్, కులదీప్ లు నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం భారత స్కోరు 92 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు.