Andhra Pradesh: ఇష్టమైన నాటకం చూస్తూనే ప్రాణం ఆగింది.. కృష్ణా జిల్లాలో వృద్ధుడి దుర్మరణం!
- నాటకాలంటే ఇష్టం పెంచుకున్న శోభనాద్రి
- ‘సత్యహరిశ్చంద్ర’ చూస్తూ మృతి
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఆయనకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే చివరికి నాటకం చూస్తునే ఆ పెద్దాయన తుదిశ్వాస విడిచాడు. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలంలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి చెందిన దోమతోటి శోభనాద్రి(65)కి నాటకాలంటే చాలా ఇష్టం. నాటకాలు ఎక్కడ నిర్వహించినా అక్కడ వాలిపోయేవాడు. ఈ నేపథ్యంలో వేమవరం కొండలమ్మతల్లి దేవస్థానం వద్ద శనివారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. దీనికి హాజరైన శోభనాద్రికి గుండెపోటు వచ్చింది. దీంతో నాటకం చూస్తూనే ప్రాణాలు కోల్పోయి కుర్చీపై తలవాల్చేశాడు. అయితే పక్కనున్నవాళ్లు ఆయన నిద్రపోతున్నాడని భావించి ఊరుకున్నారు.
ఆదివారం ఉదయం 5 గంటల వరకూ నాటక ప్రదర్శన సాగింది. చివరికి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా, ఒక్క శోభనాద్రి మాత్రమే ఉండిపోయాడు. ఆయన్ను మేల్కొలిపేందుకు యత్నించగా అచేతనంగా పడిపోవడంతో చివరికి నాటక సిబ్బంది గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.