Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏడాదిలో ఓ రోజు సైక్లోన్ డే!
- తిత్లీ తుపానుపై చంద్రబాబు సమీక్ష
- తుపాన్ల సమయంలో కచ్చితమైన విధానాన్ని పాటించాలని నిర్ణయం
- బలమైన గాలులను సైతం తట్టుకునే విద్యుత్ స్తంభాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిలో ఓ రోజును ‘సైక్లోన్ డే’గా నిర్వహించాలని తిత్లీ తుపానుపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయించారు. గతంలో సంభవించిన హుద్‌హుద్, ప్రస్తుత తిత్లీ తుపాను అనుభవాల ఆధారంగా తుపానులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను ముందుగానే సన్నద్ధం చేయడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
తుపానులన్నీ అక్టోబరు నెలలోనే వస్తున్నా వాటిని ఎదుర్కొనేందుకు సరైన విధానం అంటూ లేదని, హుద్‌హుద్ తుపాను సమయంలో రూపొందించిన బ్లూబుక్‌లో కొన్నింటిని ప్రస్తావించినా వాటిని అనుసరించడం లేదని పేర్కొన్నారు. ఇకపై ఇలా జరగకూడదని, కచ్చితమైన విధానాన్ని అనుసరించాల్సిందేనన్నారు.
తుపానులు, భారీ వర్షాలు వచ్చేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రతి ఏడాది ఓ రోజును ‘సైక్లోన్ డే’గా నిర్వహించాలని నిర్ణయించారు. తుపాన్ల సమయంలో వీచే గాలులకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. స్తంభాలు విరిగిపడడం, చెట్లు కూలడం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
కాబట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం భూగర్భ కేబుళ్లు వేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి కాబట్టి, బలమైన గాలులను సైతం తట్టుకుని నిలబడగలిగేలా విద్యుత్ స్తంభాల్ని వినియోగించనున్నారు. ప్రస్తుతం ఉన్న స్తంభాల స్థానంలో వీటిని అమరుస్తారు. ప్రతీ పది, పదిహేను గ్రామ పంచాయతీలకు ఓ జనరేటర్ ను ఉంచాలని సమీక్షలో నిర్ణయించారు.