Uttam Kumar Reddy: మాకు పిల్లలు లేరు.. తెలంగాణ ప్రజలే మా కుటుంబం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మిగ్-21, మిగ్-23 యుద్ధ విమానాల పైలట్ గా పని చేశా
- చిన్న వయసులోనే రాష్ట్రపతి కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించా
- ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన లేదు
తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరానని.. ఆ తర్వాత భారత వైమానిక దళంలో పని చేశానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పని చేశానని... మిగ్-21, మిగ్-23 యుద్ధ విమానాల పైలట్ గా పని చేశానని చెప్పారు. దేశ రక్షణ కోసం ఎన్నో సంవత్సరాల పాటు పని చేయడం తనకు ఎంతో తృప్తిని కలిగించే విషయమని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
భారత రాష్ట్రపతి కార్యాలయంలో చిన్న వయసులోనే కీలక బాధ్యతలను నిర్వహించే అవకాశం తనకు రావడం ఒక అదృష్టమని ఉత్తమ్ చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే కోరికతోనే... ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను, తన భార్య పద్మావతి ఇద్దరం ఎమ్మెల్యేలుగానే ఉన్నామని.. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తమ కుటుంబమని అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని... తమ అధినేత రాహుల్ గాంధీ ఎవర్ని సీఎం చేసినా, తాను అంగీకరిస్తానని చెప్పారు.