srilekha: చిన్నప్పటి నుంచి ఎవరికీ భయపడేదానిని కాదు: ఎం.ఎం.శ్రీలేఖ
- నిజమే నాకు చాలా పొగరు
- స్కూల్లో టీచర్ ను కొట్టాను
- ఇంటికొచ్చిన సంగీతం మాస్టారును కొట్టాను
గాయనిగాను .. సంగీత దర్శకురాలిగాను ఎం.ఎం. శ్రీలేఖకి మంచి గుర్తింపు వుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో శ్రీలేఖ మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "చిన్నప్పటి నుంచి నేను చాలా మొండి ఘటాన్ని. ఏ పనైతే వద్దంటారో .. అదే పని చేసే దానిని. నాకు చాలా పొగరని చాలామంది అంటూ వుంటారు .. అందులో నిజం లేకపోలేదు కూడా.
చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా నన్ను కొడితే వెంటనే తిరిగి ఒకటి ఇచ్చేస్తుంటాను. ఈ విషయంలో ఎదుటివాళ్లు ఎవరనేది కూడా చూడను. ఒకసారి స్కూల్లో ఒక టీచర్ నన్ను కొట్టింది .. అంతే నేను తిరిగి కొట్టేశాను. దాంతో నాన్నగారు దీనికి చదువు అబ్బదు అని చెప్పేసి, సంగీతం నేర్పించాలనుకున్నారు. అందుకోసం ఇంటికి ఒక మాస్టారును పిలిపించారు. రెండు రోజుల తరువాత తాను చెప్పిన పాఠాన్ని మాస్టారు అప్పగించమన్నారు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా నేను పాఠం అప్పగించాను. ఆయనకి కోపం వచ్చి ఒక్కటిచ్చారు. నేను పాఠం అప్పగించినా కొడతారా అని బెత్తాన్ని తిప్పి తిప్పి మరీ ఆయనను కొట్టాను" అని శ్రీలేఖ చెప్పుకొచ్చారు.