Telangana: తెలంగాణకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
- ఇళ్ల నిర్మాణానికి విడుదల చేసిన రూ. 190 కోట్లు వెనక్కి
- ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడమే కారణం
- రెండో విడత నిధులను కూడా కోరని టీఎస్ ప్రభుత్వం
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. రాష్ట్రానికి విడుదల చేసిన నిధులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. 2016-17 ఏడాదికి గాను పేదల ఇళ్ల నిర్మాణానికి విడుదల చేసిన రూ. 190 కోట్లను వెనక్కి తీసుకుంది. ఈ నిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఇల్లును కూడా నిర్మించకపోవడమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కారణం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఈ వివరాలు బయటకు వచ్చాయి.
డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వాడుకోలేదు. పేదలకు ఇళ్లను నిర్మించాలనే పథకంలో భాగంగానే కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఈ నిధులను వాడుకోని రాష్ట్ర ప్రభుత్వం... రెండో విడత నిధుల కోసం కూడా కేంద్రాన్ని కోరలేదు. అంతేకాదు, అవాస్ యోజన వెబ్ సైట్ లో కూడా ఇళ్ల నిర్మాణం వివరాలను అప్ డేట్ చేసేందుకు తెలంగాణ సర్కారు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఇచ్చిన నిధులకు కేంద్రం వెనక్కి తీసుకుంది.