jaipalreddy: జైపాల్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి లేదా క్షమాపణలు చెప్పాలి: హరీశ్ రావు
- అవినీతి మరకలంటించాలని చూస్తున్నారు
- అవినీతికి ఆస్కారం లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టాం
- జైపాల్ రెడ్డి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు
తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులను తనకు నచ్చిన సంస్థలకు మాత్రమే కేటాయిస్తున్నారని, ఏ కంపెనీ ఎక్కువ కమీషన్లు ఇస్తే, ఆ కంపెనీకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని సీఎం కేసీఆర్ పై టీ-కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వానికి అవినీతి మరకలు అంటించేందుకు జైపాల్ రెడ్డి యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టామని చెప్పారు.
నాడు కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చేసింది శూన్యమని, టీఆర్ఎస్ పాలనలోనే పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరిగిందని చెప్పారు. అవినీతికి ఆస్కారం ఉండేలా ఈపీసీ విధానాన్ని తీసుకొచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. ఆ విధానానికి స్వస్తి పలికి ఆన్ లైన్ ఈ- ప్రొక్యూర్ మెంట్ ద్వారా పనులు అప్పగించి, పారదర్శకంగా పనులు చేపట్టింది తమ ప్రభుత్వమేనని అన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జైపాల్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి లేదా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు, వార్తా కథనాల్లోకి ఎక్కేందుకే జైపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని హరీశ్ విమర్శించారు.