Rahul Gandhi: బీజేపీ మంత్రుల నుంచి ఆడబిడ్డలను కాపాడండి: రాహుల్ గాంధీ
- 'బేటీ బచావో.. బేటీ పడావో' నినాదంపై రాహుల్ విమర్శలు
- నినాదాన్ని మార్చుకోవాలంటూ సూచన
- ఎంజే అక్బర్ ఉదంతంపై మోదీ మౌనంగా ఉన్నారంటూ ధ్వజం
'ఆడపిల్లను కాపాడండి, ఆడపిల్లను చదివించండి' అనే బీజేపీ నినాదంపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ నినాదాన్ని 'బీజేపీ మంత్రుల నుంచి ఆడబిడ్డలను కాపాడండి' అని మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ విషయంపై ప్రధాని మోదీ ఇంత వరకు స్పందించకపోవడంపై రాహుల్ మండిపడ్డారు.
మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వీరి పాలనలో నిరుద్యోగం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని దుయ్యబట్టారు. ఎంజే అక్బర్ ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినా, మోదీ మాత్రం మౌన ప్రేక్షకుడిగా ఉన్నారని అన్నారు. ఉన్నావోలో ఓ బాలికను బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసినప్పుడు కూడా మోదీ, ఉత్తరప్రదేవ్ ముఖ్యమంత్రి యోగిలు మౌనంగానే ఉన్నారని విమర్శించారు.