maoist: మావోయిస్టు మాజీ నేత రమాకాంత్ ఆత్మహత్య.. రజిత బంధువులే చంపేశారంటున్న కుటుంబసభ్యులు
- పురుగుల మందు తాగిన రమాకాంత్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు
మావోయిస్టు మాజీ నేత గుండూరు శ్రీను అలియాస్ రమాకాంత్ (45) ఆత్మహత్య చేసుకున్నారు. రమాకాంత్ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ కు చెందిన వ్యక్తి. ఆయన భార్య దేవేంద్రమ్మ అలియాస్ రజిత కూడా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దళ కమాండర్ గా ఆయన పని చేశారు. ఆ తర్వాత దంపతులు ఇద్దరూ లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలసిపోయారు.
గత కొన్ని రోజులుగా రమాకాంత్, రజితల మధ్య విభేదాలు తెలెత్తాయి. ఈ క్రమంలో ఆమె కనిపించకుండా పోయారు. దీంతో, నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అంబడిపల్లిలో ఉంటున్న రజిత బంధువుల ఇంటికి సోమవారం నాడు రమాకాంత్ వచ్చారు. అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున మృతి చెందారు. అయితే, రజిత బంధువులే రమాకాంత్ ను చంపి ఉంటారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిన కాల్చి చంపిన కేసులో రమాకాంత్ ముఖ్యపాత్రను పోషించినట్టు పోలీసు రికార్డుల్లో ఉంది. అచ్చంపేట పోలీస్ స్టేషన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ బాలస్వామిని.... లింగాల, అమ్రాబాద్ మండలాల్లో పలువురిని హతమార్చిన కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మన్ననూర్, వటవర్లపల్లి, అమ్రాబాద్, అచ్చంపేట పోలీస్ స్టేషన్లపై దాడుల్లో కూడా రమాకాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మరోవైపు, ఆర్థిక సమస్యల కారణంగానే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమైనట్టు బంధువులు చెబుతున్నారు.