chicken curry: ఇక కోడిని కోయక్కర్లేకుండానే కూర తినొచ్చు.. సరికొత్త ఆవిష్కరణ చేసిన అమెరికా శాస్త్రవేత్తలు!
- కణ విభజన ద్వారా మాంసం తయారీ
- రుచిలో చికెన్ కు ఏమాత్రం తీసిపోని మాంసం
- మేకలు, చేపల మాంసాన్ని తయారుచేయొచ్చన్న శాస్త్రవేత్తలు
కోడికూర తినాలంటే ఏం చేయాలి? ఇదేం పిచ్చి ప్రశ్న.. కావాలంటే చికెన్ షాపుకు పోవాలి. లేదంటే ఇంట్లోనే కోసుకోవాలి అని చెప్పేయకండి. ఎందుకంటే ప్రస్తుతమున్న ఈ పరిస్థితి త్వరలోనే మారబోతోంది. ఒక్క కోడిని కూడా కోయకుండానే కేజీల కొద్దీ చికెన్ ను లాగించేసే దిశలో శాస్త్రవేత్తల ప్రయోగాలు సఫలమయ్యాయి. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఒకటి ఈ విషయంలో కీలక ముందడుగు వేసింది.
తొలుత సజీవంగా ఉన్న కోడి నుంచి కొన్ని కణాలను శాస్త్రవేత్తలు వేరు చేశారు. అనంతరం ప్రయోగశాలలో ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని అభివృద్ధి చేశారు. కణ విభజన జరిగి కృత్రిమ పద్ధతుల్లో ఈ మాంసం తయారయింది. దీన్ని వండిన అనంతరం రుచి చూడగా, అచ్చం చికెన్ లాగే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
కేవలం కోళ్లనే కాకుండా మేకలు, గొర్రెలు, బీఫ్, చేపలు సహా పలు జంతువుల కణాల ద్వారా కృత్రిమంగా మాంసాన్ని ఉత్పత్తి చేయొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మాంసంతో ఎలాంటి వ్యాధులు రావనీ, జంతువులను చంపాల్సిన అవసరం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.