Yadagirireddy: ఆదర్శ ప్రజాప్రతినిధి: మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా సొంతిల్లు లేదాయె!
- నిరాడంబరుడు, సైద్ధాంతిక బద్ధుడు రామన్నపేట మాజీ శాసన సభ్యుడు
- 1885, 1989, 1994లో నియోజకవర్గానికి సీపీఐ తరపున పాత్రినిధ్యం
- ప్రస్తుతం అద్దె ఇంట్లో ప్రభుత్వం అందించే పింఛన్ తో జీవనం
ప్రజాప్రతినిధి అంటే కోట్లకు పడగలెత్తడం...అవినీతికి బార్లా తలుపులు తెరవడం... రాజభోగాలు అనుభవించడం...రాజప్రాసాదంలాంటి ఇంటిలో నివాసం అనుకునే ఈ రోజుల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి సొంతిల్లు లేదు. అద్దె కొంపలో ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ప్రధానాధారంగా జీవిస్తున్నారంటే నమ్మగలరా?...మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఘనత ఇది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గం నుంచి సీపీఐ తరపున 1985, 1989, 1994లో యాదగిరి రెడ్డి శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. మొదటి నుంచీ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి పనిచేశారు. అప్పటికీ, ఇప్పటికీ వేతనం, పింఛనే ఆధారం. తొలిరోజుల్లో రూ.12 వేలు వేతనంగా వస్తే తర్వాత అది రూ.15 వేలకు పెరిగింది. దీంతో ముగ్గురు పిల్లల్ని సర్కారు బడుల్లోనే చదివించారు. కూతురిని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంచి చదువు కొనసాగించారు.
మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బుల్లేకపోతే ప్రభుత్వం తనకు ఇచ్చిన స్థలాన్ని అమ్మేసి ఖర్చుకు వినియోగించారు. పార్టీ అనుమతించినన్నాళ్లు నిబద్ధత, సైద్ధాంతిక రాజకీయాలు చేసిన ఆయన తన శేషజీవితాన్ని హైదరాబాద్ శివారు చంపాపేటలోని అద్దె ఇంట్లో సహధర్మచారిణితో కలిసి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.30 వేలు పింఛన్ ప్రస్తుతం యాదగిరి రెడ్డికి జీవనాధారం. ముగ్గురు పిల్లల్లో పెద్దకొడుకు రాజశేఖరరెడ్డి న్యాయవాదిగా, చిన్నకొడుకు రామ్మోహనరెడ్డి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.