sabarimala: శబరిమల ఆలయం వద్ద భారీ భద్రత.. కొనసాగుతున్న ఉద్రిక్తత
- నిలక్కల్ వద్ద నిరసనకారుల ఆందోళన
- స్వల్పంగా లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
- అయ్యప్ప సన్నిధానం వద్ద వెయ్యి మంది పోలీసుల మోహరింపు
శబరిమల ఆలయం తలుపులు ఈరోజు తెరుచుకోనున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు పలువురు మహిళలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మహిళలను లోపలకు అనుమతించబోమంటూ భారీ సంఖ్యలో ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కేరళలో నెలకొంది.
శబరిమలకు గేట్ వే అయిన నిలక్కల్ (శబరిమలకు 20 కి.మీ. దూరం) వద్ద నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆలయ సన్నిధానం వద్ద వెయ్యి మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. వీరిలో 200 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. కొన్ని గంటల్లో ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో, ప్రభుత్వం కూడా ఇక్కడి పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఐదు రోజుల తర్వాత అక్టోబర్ 22న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.