sailaja: అప్పట్లో అన్నయ్య నాకు ఇచ్చిన సలహా అదే: ఎస్. పి. శైలజ
- సుశీలగారు అంటే నాకు ఇష్టం
- ఆమె పాటలు వింటూ పెరిగాను
- నా స్వరంపై ఆమె ప్రభావం వుండేది
బాలసుబ్రహ్మణ్యం సోదరిగానే కాదు .. మంచి సింగర్ గాను శైలజ గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడు శుభలేఖ సుధాకర్ తో చాలాకాలం క్రితమే ఆమె వివాహం జరిగింది. వాళ్ల ఒక్కగానొక్క సంతానమైన అబ్బాయి చెన్నైలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. తాజాగా 'వనిత' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శైలజ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.
"చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడటంపై ఆసక్తి వుండేది. అందువలన నాపై గాయని సుశీల గారి ప్రభావం ఎక్కువగా వుండేది. స్కూల్ డేస్ లో కాంపిటీషన్స్ లో సుశీలగారి పాటలే పాడేదానిని. నేను సినిమాల్లో పాడటం మొదలుపెట్టిన తరువాత కూడా నాపై నుంచి సుశీలగారి ప్రభావం పోలేదు. అయితే, 'ఆల్రెడీ సుశీలగారు పాడుతున్నారు .. ఆమె మాదిరిగానే నువ్వు పాడటం వలన ప్రయోజనం ఉండదు. నీ స్వరానికంటూ ప్రత్యేకత ఉండాలి .. ఆ ప్రత్యేకత కారణంగానే నువు నిలబడతావు' అని అన్నయ్య బాలు సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి నా దైన స్వరంతో పాడటం మొదలుపెట్టాను" అని చెప్పుకొచ్చారు.