Telangana: తెలంగాణలో పార్టీలన్నీ తోడు దొంగలుగా మారాయి.. కోదండరాం జనసమితిని తిరస్కరించండి!: మావోయిస్టుల బహిరంగ లేఖ
- విడుదల చేసిన కార్యదర్శి హరిభూషణ్
- దోపిడీదారులకు పార్టీలు ప్రతినిధులుగా మారాయి
- కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలి
తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు స్పందించారు. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ తోడు దొంగలుగా తయారయ్యాయని రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి హరిభూషణ్ ఈరోజు బహిరంగ లేఖను విడుదల చేశారు. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు దోపిడీ దారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అందులో ఆరోపించారు. తెలంగాణ జనసమితి అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని, దాన్ని నిరసించాలని కోరారు.
తెలంగాణలో నెలకొన్న కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. తప్పుడు ఆరోపణలు, అభియోగాలతో అరెస్ట్ చేసిన రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు, ఉద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన ధర్నాచౌక్ ను పునరుద్దరించాలని కోరారు. అలాగే ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలన్నారు.