uber: అర్ధరాత్రి తల్లీకుమార్తెలను ఒంటరిగా వదిలి వెళ్లలేక ఆగిపోయిన క్యాబ్ డ్రైవర్.. నెటిజన్ల ప్రశంసలు!
- ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసిన తల్లీకూతుళ్లు
- ఒంటిగంటకు ఇంటికి చేరుకున్న క్యాబ్
- అపార్ట్ మెంట్ గేటుకు తాళం వేసిన యజమాని
దేశంలో చిన్నారులు, వృద్ధులు అన్న తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ క్యాబ్ డ్రైవర్ మానవత్వాన్ని చూపాడు. ఒంటరిగా తల్లీకుమార్తెలను వదిలివెళ్లకుండా ఇంట్లోవాళ్లు వచ్చేవరకూ ఆగిపోయాడు. ఈ క్రమంలో తన ఆదాయాన్ని కోల్పోయినా లెక్క చేయలేదు. ఇటీవల కోలకత్తాలో జరిగిన ఘటనను స్వయంగా సదరు యువతి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
అక్టోబర్ 13న ప్రియాస్మిత తన తల్లితో కలిసి ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేసింది. డ్రైవర్ సంతోష్ రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటి వద్ద దించాడు. అయితే అపార్ట్ మెంట్ ప్రధాన గేటు మూసివేసి ఉండటాన్ని గమనించిన డ్రైవర్ సంతోష్.. వారిద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్లడానికి నిరాకరించాడు. ఈ సందర్భంగా పలువురు కస్టమర్లు కారును బుక్ చేయగా, తాను రాలేనని వాటిని క్యాన్సిల్ చేసేశాడు.
అలా దాదాపు గంటా 50 నిమిషాలు అక్కడే ఉన్నాడు. చివరికి లోపలి నుంచి ఎవరో వచ్చి గేట్ తీసేవరకూ సంతోష్ అక్కడే ఉన్నాడు. వారిద్దరూ లోపలకు వెళ్లిన తర్వాతే సంతోష్ అక్కడి నుంచి బయలుదేరాడు. రాత్రిపూట సంతోష్ తమకు అండగా నిలిచినందుకు ప్రియ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ట్వీట్ ను ఉబెర్ కంపెనీకి ట్యాగ్ చేసింది. కాగా, సంతోష్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.