jupudi: ముఖ్యమంత్రి అవ్వాలనే కలలు పవన్ కల్యాణ్ కంటూనే ఉండాలి: జూపూడి ప్రభాకర్
- మోదీ డైరెక్షన్ లో ఓ కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడట! అవండి
- ‘జనసేన’కు దక్కేవి డిపాజిట్లే..గెలుపు కాదు
- చంద్రబాబే మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి
‘జనసేన’ పోటీ చేసే స్థానాల్లో దక్కేవి డిపాజిట్లే తప్ప గెలుపు కాదని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పార్టీ ఒక కులానికి చెందిన పార్టీ అని, ఆ పార్టీలో సామాజిక న్యాయం లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ అన్నయ్య చిరంజీవి పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ‘జనసేన’ నిర్వహించిన కవాతుపై ఆయన విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ కవాతును ఢిల్లీలో చేసినట్టయితే బాగుండేదని సూచించారు. వారసత్వ రాజకీయాలపై పవన్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తాను ముఖ్యమంత్రి కావాలని లోకేశ్ ఏనాడూ అనలేదని అన్నారు.
‘మోదీ గారి డైరెక్షన్ లో ఓ కానిస్టేబుల్ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడట! అవండి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబుని, లోకేశ్ ని విమర్శిస్తూ మీరు ఎలా అవుతారో! ప్రజలు కచ్చితంగా సమాధానం చెబుతారు’ అని అన్నారు. కొన్ని వేల మంది అబ్దుల్ కలాంలను తయారు చేయాలన్న స్వాప్నికుడు చంద్రబాబు ఒకవైపు.. కారులో ఎక్కి కవాతు చేసే ఒక సినిమా హీరో మరోవైపు అని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబునాయుడే మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు భావిస్తున్నారని, ముఖ్యమంత్రి కావాలనే కలలు పవన్ కల్యాణ్ కంటూనే ఉండాలని సెటైర్లు విసిరారు.