Madhavi: నాలా మరెవరూ బాధపడొద్దు.. మా నాన్నకు శిక్ష పడాల్సిందే: తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి
- ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాధవి
- మంత్రి తలసాని తనను తండ్రిలా ఆదుకున్నారన్న బాధితురాలు
- సొంత తండ్రి నమ్మించి మోసం చేశాడని ఆవేదన
తనలా మరే అమ్మాయి బాధపడకూడదని, తనను నమ్మించి పిలిచి దాడి చేసిన తన తండ్రి మనోహరాచారికి శిక్ష పడాల్సిందేనని మాధవి పేర్కొంది. గత నెల రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవి బుధవారం డిశ్చార్జ్ అయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సర్టిఫికేట్లు ఇస్తానని నమ్మించి పిలిచి తండ్రి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన తండ్రి మనోహరాచారికి శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పింది. వైద్యులు తనను కంటికి రెప్పలా కాపాడారని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్న తండ్రిలా ఆదుకున్నారని పేర్కొంది.
కుమార్తె ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయిన మనోహరాచారి గత నెల 19న కుమార్తె మాధవికి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగాడు. ఇంట్లో ఉండిపోయిన ఆమె సర్టిఫికేట్లు ఇస్తానని, కొత్త బట్టలు పెడతానని నమ్మించాడు. ఎర్రగడ్డ గోకుల్ థియటర్ వద్దకు రావాల్సిందిగా కోరాడు. తండ్రి మాటలు నమ్మి అక్కడికి వచ్చిన కూతురు, అల్లుడిపై కత్తితో దాడి చేశాడు. అయితే, అదృష్టవశాత్తు ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు.