Vijayawada: ఉదయం మహిషాసుర మర్దినిగా, సాయంత్రం రాజరాజేశ్వరిగా... నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు
- నేడు రెండు అవతారాల్లో కనిపించనున్న దుర్గమ్మ
- భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి
- ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేసిన అధికారులు
విజయవాడ ఇంద్రకీలాద్రితో పాటు, ప్రముఖ శైవక్షేత్రాల్లో నేటితో దసరా వేడుకలు ముగియనున్నాయి. మహర్నవమి, విజయదశమి తిథులు ఒకేరోజు రావడంతో నేడు రెండు విభిన్న అలంకరణల్లో అమ్మవారు భక్తులను కరుణించనుంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఈ ఉదయం మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తోంది. తెల్లవారుజాము నుంచి పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుండగా, ఉదయం 11 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 11 గంటల నుంచి ఒంటి గంట వరకూ అలంకరణను మార్చనున్నామని, ఆ సమయంలో క్యూలైన్లలోని భక్తులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు.
భక్తుల రద్దీ దృష్ట్యా, అంతరాలయం, రూ. 300, రూ. 100 ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుందని, రాత్రి 11 గంటల వరకూ భక్తులకు నిరాటంకంగా దర్శనం కల్పిస్తామని అన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి ఉంటుందని, పూర్ణాహుతితో ఉత్సవాలకు లాంఛనంగా ముగింపు పలకనున్నామని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల తరువాత కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.