Hera Group: 6 సంవత్సరాల్లో రూ. 800 కోట్లు నొక్కేసిన నౌహీరా!
- 2010-11లో రూ. 27 లక్షల టర్నోవర్
- ఆపై ఇబ్బడిముబ్బడిగా పెరిగిన హీరా గ్రూప్ టర్నోవర్
- మనీ ల్యాండరింగ్ జరిగిందంటున్న సీసీఎస్ పోలీసులు
2010-11లో రూ. 27 లక్షలుగా ఉన్న హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరు సంవత్సరాల్లో అంటే... 2016-17లో రూ. 800 కోట్లకు పెరిగింది. హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ అరెస్ట్ తరువాత, కేసును విచారించిన సీసీఎస్ పోలీసులు, ఈ డబ్బుకు లెక్కలు లేవని, పూర్తిగా హవాలా సొమ్మేనని తేల్చారు.
లావాదేవీల వివరాలు, డాక్యుమెంట్లను ఆమె సంస్థలు సమర్పించలేదని, కనీసం ఆదాయపు పన్ను శాఖకు, ఆర్వీసీకి కూడా తెలియదని అన్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ, అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా నౌహీరా వ్యవహరించారని అధికారులు అంటున్నారు. ఆమెను విచారణ నిమిత్తం 14 రోజుల కస్టడీకి అప్పగించాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చిన్న చిన్న వ్యాపారాలు చేసిన అనుభవంతో 2010లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను స్థాపించిన ఆమె, మొత్తం 15 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. బంగారం వ్యాపారం చేస్తున్నామని ఆమె చెప్పుకున్నప్పటికీ, ఆ వ్యాపారం చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. విదేశాల్లో శాఖలున్న హీరా గ్రూప్ మనీ ల్యాండరింగ్ కు కూడా పాల్పడిందని చెబుతున్న పోలీసులు, తమకు అందిన సమాచారం మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ, ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్, ఎస్ఎఫ్ఐఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్)లతో పంచుకుంటున్నట్టు తెలిపారు.