swine flu: హైదరాబాద్ వాసులకు హై అలెర్ట్.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య ఆరోగ్య శాఖ
- నగరంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి
- ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 11 మంది మృతి
- జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ
హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వైన్‌ప్లూ వేగంగా విస్తరిస్తోందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. మధుమేహంతో బాధపడుతున్న వృద్ధులు, రక్తపోటు, అధిక బరువుతో బాధపడుతున్నవారు, గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులున్న వారికి స్వైన్ ఫ్లూ త్వరగా సోకే అవకాశం ఉందని, వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మొత్తం 11 మంది స్వైన్ ఫ్లూ కారణంగా మరణించడంతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ ఈ ప్రకటన చేసింది. పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ మరో నలుగురు ఆసుపత్రిలో చేరినట్టు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు.
జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. వంటి లక్షణాలుంటే దానిని స్వైన్‌ఫ్లూగా అనుమానించవచ్చు. ఇవి తీవ్రమైతే వెంటనే వైద్యులను స్పందించాలి. ఆలస్యం చేయడం వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్ల వచ్చు. బయటకు వెళ్లేటప్పుడు నోటికి మాస్కులు ధరించాలి. ఇతరులతో కరచాలనం (షేక్ హ్యాండ్) చేయకూడదు. దగ్గినా, తుమ్మినా వెంటనే చేతులు కడుక్కోవాలి. స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్న వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడం మంచిది.