indo-chaina border: భారత్ - చైనా సరిహద్దుల్లో కీలాంగ్ వద్ద భూగర్భ రైల్వే స్టేషన్
- హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో రూపుదాల్చబోతున్న తొలి అద్భుతం
- బిలాస్‌పుర్ - మనాలి - లేహ్ మార్గంలో నిర్మాణ ప్రతిపాదన
- లాహౌల్, స్పితీ జిల్లాల కేంద్రంగా కీలాంగ్ పట్టణం
భారత్ - చైనా సరిహద్దుల్లో మన రైల్వే శాఖ అద్భుతాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఉంది. అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన బిలాస్‌పుర్ - మనాలి - లేహ్ రైలు మార్గంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కీలాంగ్ వద్ద భూగర్భంలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి సర్వే పూర్తికాగా తుది దశ అంచనాలు పూర్తయితే నిర్మాణం ప్రారంభమవుతుందని ఉత్తర రైల్వే కనస్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ డి.ఆర్.గుప్తా తెలిపారు.
దేశంలో ఢిల్లీ నగరంలో భూగర్భంలో మెట్రో మార్గం ఉన్నా రైల్వే స్టేషన్లు లేవు. ఇండో - టిబెటిన్ సరిహద్దుకు 120 కిలోమీటర్ల దూరంలో మనాలీ పట్టణానికి 26 కిలోమీటర్ల ఉత్తరాన లాహౌల్, స్పితీ జిల్లాల కేంద్రంగా కీలాంగ్ పట్టణం ఉంది. తుది దశ సర్వే పూర్తయ్యాక కచ్చితంగా ఎక్కడ రైల్వే స్టేషన్ నిర్మించేది నిర్ణయిస్తారు.
స్టేషన్‌కు అటూ ఇటూ 27 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం ఉంటుంది. మధ్యలో 3 వేల అడుగుల ఎత్తున రైల్వేస్టేషన్ రూపుదిద్దుకోనుంది. ఈ భూగర్భ రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు పట్టణాలు కీలాంగ్తో అనుసంధానమవుతాయి. చైనా సరిహద్దులోని పలు ప్రాంతాలకు సరకు రవాణా సులువవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంగా రూపుదాల్చనున్న బిలాస్పూర్ - మనాలి- లేహ్ మార్గాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. చైనా సరిహద్దులో సముద్రమట్టానికి 5,360 మీటర్ల ఎత్తులో 465 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ రైల్వేలైనుకు 83,360 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా.
రైలు మార్గంలో భాగంగా మొత్తం 74 సొరంగాలు, 124 పెద్ద వంతెనలు, 396 చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉష్సి, లేహ్ లోని ఫే ప్రాంతాల మధ్య 51 కిలోమీటర్ల లైను నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీ నుంచి లేహ్ కు వెళ్లాలంటే 40 గంటలు సమయం పడుతోంది. ఈ 465 కిలోమీటర్ల మార్గం పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం సగానికి సగం అంటే 20 గంటలకు తగ్గనుండడం గమనార్హం.