thunderbolt: ఊపిరి తీసిన పిడుగు శబ్దం.. గుండె ఆగి మరణించిన రైతు!
- పిడుగు శబ్దానికి విలవిల్లాడిన గుండె
- ఆసుపత్రికి తరలించే లోపే మృతి
- బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్న తహసీల్దార్
పిడుగు పడి ప్రాణాలు పోవడం గురించి విన్నాం. కానీ పిడుగు శబ్దానికే ఓ అభాగ్యుడి గుండె ఆగింది. గుంటూరు జిల్లా నందిగామలోని మురళీనగర్‌లో జరిగిందీ ఘటన. లారీ డ్రైవర్ అయిన ముత్తనబోయిన లక్ష్మీనారాయణ (41) ఇటీవల మిరపపంట వేశాడు. బుధవారం పంటను పరిశీలించేందుకు పొలానికి వెళ్లాడు. అప్పటికే చిరు జల్లులు పడుతుండడంతో తడుస్తూనే ఇంటికొచ్చి కూర్చుకున్నాడు.
ఆ తర్వాత కాసేపటికే అత్యంత కాంతిని వెదజిమ్ముతూ.. భారీ శబ్దంతో పిడుగుపడింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడిన లక్ష్మీనారాయణ గుండె నొప్పిగా ఉందంటూ చేతితో గుండెను పట్టుకుని విలవిల్లాడాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన ఇన్చార్జ్ తహసీల్దారు కె.శ్రీనివాసరావు, వీఆర్వో నరసింహస్వామి తదితరులు మృతదేహాన్ని సందర్శించారు. చంద్రన్న బీమా కింద బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.