Kurnool District: కర్రలు నూరుతున్న 11 గ్రామాలు... బన్నీ ఉత్సవం పేరిట రక్తపాతానికి సిద్ధం!
- దసరా రోజు రాత్రి బన్ని ఉత్సవం
- స్వామి విగ్రహం కోసం కొట్టుకునే గ్రామస్థులు
- ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసుల విన్నపం
దసరా పేరు చెబితే, నవరాత్రులు, తెలంగాణలో జరిగే బతుకమ్మ, అలయ్ బలయ్ తో పాటు కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం కూడా గుర్తుకు వస్తుంది. స్వామివారి విగ్రహాలను స్వాధీనం చేసుకునేందుకు పోటీపడే 11 గ్రామాల ప్రజలు, సంప్రదాయం, ఉత్సవం పేరిట కర్రలతో తలలు పగిలేలా కొట్టుకుంటారు. ఈ సంవత్సరం కూడా బన్ని ఉత్సవానికి సర్వం సిద్ధం కాగా, పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో తీవ్ర గాయాలపాలై గతంలో పలువురు మరణించిన నేపథ్యంలో ఈ దఫా మరింతగా భద్రతను కట్టుదిట్టం చేశామని, డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నామని అధికారులు తెలిపారు.
దేవరగట్టులోని మాలమల్లేశ్వరస్వామి విగ్రహం కోసం సమీపంలోని 11 గ్రామాల భక్తులు కర్రలతో కొట్టుకుంటారు. దసరా రోజు అర్ధరాత్రి ఉత్సవం నుంచి స్వామి వారి విగ్రహాన్ని స్వాధీనం తీసుకుని తమ గ్రామానికి తీసుకెళితే, మేలు జరుగుతుందన్నది భక్తుల నమ్మకం. అందుకోసం రక్తాన్ని చిందిస్తారు. ఏటా ఆచారం పేరుతో జరిగే ఈ బన్ని ఉత్సవంలో అనేక మందికి తలలు పగులుతాయి.
కాగా, ఈ ఉత్సవంలో ఇనుప చువ్వలు కట్టిన కర్రలు వాడనున్నారని నిఘా వర్గాలు చెప్పడంతో పోలీసు అధికారులు, గ్రామాల్లో తిరిగి ఇల్లిల్లూ సోదాలు చేస్తున్నారు. వేడుక ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలను కోరారు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.