Chandrababu: పలాసకు వచ్చి చంద్రబాబుకు రూ. 66 లక్షల విరాళాన్ని అందజేసిన నారా బ్రాహ్మణి!
- తిత్లీ తుఫాను బాధితులకు సాయం
- ఇప్పటికే మజ్జిగ, పాలు పంచుతున్నామన్న బ్రాహ్మణి
- మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సాయపడాలని వినతి
తిత్లీ తుపాను దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన గ్రామాలకు సాయం చేయాలంటూ, హెరిటేజ్ గ్రూప్ సంస్థల తరఫున నారా బ్రాహ్మణి రూ. 66 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఈ ఉదయం పలాస రైల్వే స్టేషన్ మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో చంద్రబాబు పాల్గొనగా, బ్రాహ్మణి అక్కడికి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చెక్కును చంద్రబాబుకు అందజేసిన ఆమె, గ్రామాల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించాలని కోరారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, తుపాను ప్రభావిత ప్రాంతాలను తాను చూశానని, అక్కడి పరిస్థితిని చూసి చాలా బాధపడ్డానని అన్నారు. తనవంతు సాయంగా ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే హెరిటేజ్ తరఫున ఈ సాయం చేశానని చెప్పారు. తమ సంస్థ ద్వారా మంచినీరు, మజ్జిగ, పాలు అందిస్తున్నామని, ఇతర సంస్థలు కూడా ముందుకొచ్చి తుపాను బాధితులను ఆదుకోవాలని బ్రాహ్మణి కోరారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు, బ్రాహ్మణిలకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, కళా వెంకట్రావు, పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.